కరోనా వైరస్‌ను నియంత్రణలో పెట్టడానికి యావత్ ప్రపంచం తీవ్రంగా కృషి చేస్తోంది. మనుషుల ప్రాణాలను మింగేస్తున్న ఆ వైరస్‌ను అదుపులోకి తీసుకురావడానికి వైద్య నిపుణులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.. కరోనా విజృంభణకు జడిసిన జనం వ్యాక్సిన్ బాట పట్టారు. మన దగ్గర కూడా కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకోవడానికి ప్రజలు క్యూలు కడుతున్నారు. మొన్నామధ్యనే రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మరో కొత్త ఔషధం మనముందుకొస్తోంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలలో క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకున్న మోల్ను ఫిరావిర్ -400 ఎంజీ అనే ఆ ఔషధం ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు రెడీ అయ్యింది. ఈ ట్రయల్స్ మన హైదరాబాద్‌లోనే జరుగుతుండటం గమనార్హం. ఈ ట్రయల్స్ దేశంలోనే తొలిసారిగా యశోద హాస్పిటల్‌లో జరగబోతున్నాయి.. ఈ విషయాన్ని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు.
ఈ ట్రయల్స్‌ను నాట్కో ఫార్మా-యశోద ఆస్పత్రిలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిర రెండు దశల ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, ఈ ఔషధాన్ని వాడిన వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని అంటున్నారు. పైగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారంటున్నారు. ఇది శుభసూచకమే! మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశ వ్యాప్తంగా 34 ఆసుపత్రులను, 1,218 మందిని ఎంపిక చేసుకున్నారు. యశోద హాస్పిటల్‌లో 50 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి మైల్డ్ సింప్టమ్స్‌తో బాధపడుతున్నవారిని ఇందు కోసం ఎంచుకున్నారు.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారిని ఎంపిక చేసుకున్న వైద్య బృందం వారికి మందు ఎలా పని చేస్తుందన్నది తెలుసుకుంటారు.